ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
వెల్గటూరు, ఆగస్టు 3 (విజయ క్రాంతి): బిఆర్‌ఎస్ నాయకుల ఎల్లంపల్లి ప్రాజెక్టు, నియోజకవర్గ అభివృద్ధిపై చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తూ సోమవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది మేడారం పంప్ హౌస్ వద్ద ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నంది పంప్ హౌస్ ద్వారా నంది మేడారం చెరువును నింపుతున్న నీరు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతోందని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకుని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని బిఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






