ప్రజల శ్రేయస్సే ప్రధాన లక్ష్యం
- ఇల్లందు అభివృద్ధికి రెండు విడతల్లో రూ.50 కోట్లు
- సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుదాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటిడిఏ పీవో రాహుల్ విస్తృత పర్యటన చేశారు. మొదటగా 10వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తడికమల్ల భాగ్యమ్మ, కోడిమల్ల లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని పూజలు నిర్వహించి గృహాలను ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్‌పర్సన్ గది ప్రారంభించి చైర్‌పర్సన్ కిరణ్ మిత్రకు శుభాకాంక్షలు తెలియజేసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికల హామీలను తప్పకుండా నెరవేర్చుతూ ఇల్లందు అభివృద్ధికి ఇచ్చిన మాట ప్రకారం త్వరలో రెండు విడతల్లో నిధులు విడుదల చేస్తామని, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రజాప్రతినిధులు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచిస్తూ ప్రజలతో నిత్యం సంబంధం పెంచుకుని సేవాభావంతో పనిచేయాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ మంత్రి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, కొత్త కౌన్సిలర్లు ప్రతి వార్డులో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ 24 వార్డుల్లో పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వేసవిలో నీటి సమస్యలు లేకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, గృహనిర్మాణ శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో ధన్సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజు, కమిషనర్, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






