13 June, 2026 | 2:29 AM

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

13-06-2026 01:22 AM

ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి

గత రెండున్నరేళ్లలో పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లురైతు సంక్షేమానికి పెద్దపీట

వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలి

తిరుమలాయపాలెం, ఖమ్మం, జూన్ 12 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో కల్యాణలక్ష్మి, సి.ఎం. రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డైట్ ఛార్జీలను 40 శాతం పెంపు, గురుకులాల్లో కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. రెండవ విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరో 2 వేల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే రెండున్నర సంవత్సరాల్లో కూడా మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని మంత్రి తెలిపారు. గత రెండున్నరేళ్లలో పాలేరు నియోజక వర్గంలో విద్యుత్ శాఖ అభివృద్ధి పనుల కోసం రూ.37.38 కోట్ల వ్యయం చేసినట్లు వెల్లడించారు.

ఇళ్లపై నుంచి వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. రూ.9 కోట్ల వ్యయంతో మూడు సబ్స్టేషన్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.

అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ. శ్రీనివాసచారీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.