29 August, 2026 | 1:34 PM

తాడ్కోల్‌ చౌరస్తా వద్ద ప్రమాదాలకు తావులేకుండా చర్యలు

29-08-2026 10:57 AM

స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, సూచిక బోర్డుల ఏర్పాట్లకు ప్రణాళిక...

ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్...

బాన్సువాడ, ఆగస్టు 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో(Tadkol Crossroads) చిన్నారి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనతో బాన్సువాడ మున్సిపల్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చౌరస్తా వద్ద రహదారి భద్రతను మెరుగుపరిచే పనులకు శ్రీకారం చుట్టింది. ప్రమాదానికి దారితీస్తున్న అడ్డంకులను గుర్తించి వాటి తొలగింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, పట్టణ సీఐ తుల శ్రీధర్ తదితరులు తాడ్కోల్ చౌరస్తాను పరిశీలించారు.

చౌరస్తా మలుపు వద్ద వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడానికి పలు అంశాలు కారణమవుతున్నట్లు గుర్తించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం, డివైడర్‌తో పాటు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన షెడ్లు, తోపుడు బండ్లు, ఫ్లెక్సీలు ట్రాఫిక్‌కు ఆటంకంగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. విగ్రహం తరలింపు రహదారి విస్తరణ అధికారుల పరిశీలన అనంతరం చర్యలు వెంటనే ప్రారంభమయ్యాయి. శనివారం జేసీబీల సహాయంతో అడ్డంకులను తొలగించే పనులు చేపట్టారు.పట్టణంలో ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలను గుర్తించి దశలవారీగా తొలగించి రహదారులను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు.