23-04-2025 06:23:00 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam terror attack)లో అనేక మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడికి కారణమైన ఉగ్రవాదుల కోసం బుధవారం భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ప్రత్యేకంగా ఒక మతం లక్ష్యంగా దాడి జరిగిందని ఆయన తెలిపారు. త్వరలోనే ఉగ్రదాడి కారకులకు దీటుగానే బదులిస్తామని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో దిలపెట్టే ప్రసక్తే లేదని, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా.. వారి వెనుక ఎవరు ఉన్నా సారే విడిచిపెట్టేది లేదని అన్నారు.
ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో జవాబు ఇస్తామని, పహల్గామ్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి పిరికిపంద చర్య అని, భారత్‌ను ఎవరూ భయపెట్టలేరని రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరించారు. ఈ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, భారత్ దీటుగా ఎదుర్కొంటుందన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానం అని, పహల్గామ్ సూత్రధారులు, పాత్రధారులను కఠినంగా శిక్షిస్తామని వ్యాఖ్యానించారు. జాతీయ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, రక్షణ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగాలని మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు.