calender_icon.png 11 May, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులు

24-04-2025 01:46:13 AM

‘నా హృదయం కలిచివేస్తోంది..’ ఆవేదనతో ట్వీట్ చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా

  1. కశ్మీర్ పర్యాటకానికి పెద్ద దెబ్బ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ముష్కరుల దాడితో పర్యాటకులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఉగ్రమూక తూటాలకు 26మంది మృతిచెందడంతో వణికిపోయిన పర్యాటకులు ఆ ప్రాంతం నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని, స్వస్థలాలకు చేరుకోవాలని తిరుగుప్రయాణమవుతున్నారు.

ఇప్పటికే వేల సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్‌ను వీడారు. బుధవారం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ నుంచి 20 విమానాలు వెళ్లాయని, 3,337మంది పర్యాటకులు తిరుగుప్రయాణమైనట్లు కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ట్వీట్ చేశారు.

ముష్కరుల దాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యాటకులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. పర్యాటకుల సౌకర్యం కోసం అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చినట్లు, రద్దీ దృష్ట్యా టికెట్ ధరలు పెంచవద్దని విమాన సంస్థలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యాటకులకు అందరూ అండగా నిలువాలని కోరారు. 

పర్యాటకుల ఆవేదన అర్థం చేసుకోగలను..: సీఎం ఒమర్ అబ్దుల్లా

కశ్మీర్ లోయ నుంచి పర్యాటకులు వీడుతుంటే తన హృదయం ద్రవీస్తోందని, వారు ఎందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోగలనని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఉగ్రదాడి తర్వాత భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పర్యాటకులు కశ్మీర్‌ను వీడటంపై ఆయన స్పందించారు. శ్రీనగర్, జమ్మూ మధ్య ఎన్‌హెచ్44పై ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూస్తున్నామన్నారు. అదనపు విమానాలు ఏర్పాటు చేయడానికి డీజీసీఏ, పౌరవిమానయాన శాఖ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కశ్మీర్ పర్యాటకానికి తీవ్ర నష్టం..

జమ్మూకశ్మీర్‌కు ప్రధాన ఆదాయం పర్యాటకమే. ప్రజలకు ఉపాధి కూడా ఆ రం గమే కల్పిస్తోంది. కశ్మీర్‌లోయ హిందూ ఆలయ పర్యాటకానికి కూడా ప్రసిద్ధి. అమర్‌నాథ్‌యాత్రకు యాత్రికులు భారీ సంఖ్య లో వస్తుంటారు. ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్‌లోయకు పర్యాటకులు భారీగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక్కడి ప్రజల ఉపాధిపై ప్రభావం చూపనుంది.