చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మంత్రి సీతక్క
హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులని మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా గోల్కొండ పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన "అమ్మ మాట – అంగన్‌వాడీ బాట" కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్(Nampally MLA Majid Hussain)తో కలిసి మంత్రి సీతక్క చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రీ-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసి, ప్రాథమిక పాఠశాలల్లో చేరిన చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాలను అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ అభ్యాసన పుస్తకాలు, ఆటవస్తువులను అందించారు. కేంద్రంలో అందుతున్న ప్రీ-స్కూల్ విద్య, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించి చిన్నారుల అభ్యాస పురోగతిపై ఆరా తీశారు.






