హరీష్‌రావు కాదు.. కాళేశ్వరావు
సిద్దిపేటకే వస్తా.. చర్చకు సిద్ధమా..?
రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు హరీష్ కు ఉందా..?
దేశంలోనే రెండు లక్షలు ఒకే సారి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ది
విలేకర్ల సమావేశంలో హరీశ్ రావు పై మంత్రి తుమ్మల ధ్వజం
బీ. ఆర్.ఎస్ లో తగిన ప్రాధాన్యం లేక హరీష్ రావు మెంటల్ బ్యాలెన్స్ తప్పారన్న తుమ్మల
ఖమ్మం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తన్నీరు హరీష్ రావు కాదు.. కాసుల రావు, కమీషన్ల రావు, కాళ్ళేశ్వరరావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామకరణం చేశారు. కమీషన్ల కోసం ఆరాటపడేది నేనా..? కాళ్ళేశ్వరరావా..? చర్చకు సిద్దమని, సిద్దపేట రమ్మంటావా..? అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హరీష్ రావు సవాల్ విసిరారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం లేదు అన్నారు. సోమవారం ఖమ్మం మంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి హరీష్ రావు పై ధ్వజమెత్తారు. భూకబ్జాలు గూర్చి నీతులు చెప్పే హరీష్ రావు నిన్న మీటింగ్ పెట్టింది కబ్జా కోరుల స్థలంలోనే అని ఆరోపించారు. కాళేశ్వరరావు గా ముద్రపడ్డ హరీష్ రావు కాంగ్రెస్ కు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.
హరీష్ రావు సొంత పార్టీలో రాజకీయ భవిష్యత్ కోసం మానసిక దౌర్భాగ్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కబ్జాదారుడు, అవినీతి కాంట్రాక్టర్ ను పక్కన పెట్టుకుని మాకు నీతులు చెబుతున్నారని అన్నారు. సిగ్గు లేకుండా ఏ మోహం పెట్టుకుని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారని విమర్శించారు.
రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావు కు లేదని, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకే సారి రెండు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని కొనియాడారు. మీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు.
కబ్జాలు కమీషన్ల విషయంలో దేశంలోనే ఏ పార్టీకి లేని చరిత్ర మీకుందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో సీతారామ ప్రాజెక్టు గూర్చి మీ గొప్పగా చెబుతున్నారు కానీ మీ పాలనలోనే పడావు పడేసిన సంగతి మర్చిపోతే ఎలా అని గుర్తు చేశారు. సెంట్రల్ వాటర్ కమీషన్ అనుమతులు లేకుండా కమీషన్ల కోసం ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మీ పాలనలో నిలిచిన సీతారామ ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తున్నామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు గూర్చి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా..? అని ప్రశ్నించారు.
సిద్దిపేటకు వస్తా చర్చకు సిద్ధమా..?
కమీషన్ల తీసుకునేదేవరో.. కాసులు వెనకేసుకుందేవరో..? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందేవరో..? చర్చించుకుందాం.. సిద్దిపేటకు రమ్మంటావా..? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కు తుమ్మల సవాల్ విసిరారు. నీ సిద్దిపేటకు వస్తా.. రైతాంగం శ్రేయస్సు కోసం స్ట్రాటజిక్ లొకేషన్ లో పెట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ పై చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. హరీష్ రావు మాట్లాడుతుంటే దేయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ప్రజలు అన్ని చూస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
రైతుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్షయమని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన స్కీములను ప్రవేశపెట్టింది అన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను నట్టేటా ముంచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యానికి బోనస్ ఇచ్చి అందుకుంటున్నామని తెలిపారు. రైతుల కోసమే రైతు భరోసా ఇస్తున్నామని, యంత్రలక్ష్మి పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.
హరీష్ రావు స్వంత నియోజకవర్గంలోనే రైతులకు మేలు చేసే పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించామని, ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ రోజు రెండవ దఫా రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా విడుదల చేస్తున్నామని, అందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, గిడ్డంగుల శాఖ చైర్మన్ నాగేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు దీపక్ చౌదరి పాల్గొన్నారు.






