8 August, 2026 | 10:39 PM

అదృశ్య‌మైన వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

08-08-2026 09:18 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): అదృశ్యమైన వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగిచెర్ల‌కు చెందిన అంబ‌టి ర‌మేష్‌(47) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గ‌త కొంత‌కాలంగా స్థానికంగా నివ‌సిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఈ నెల 6న రాత్రి 8గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్ప‌కుండా కారు(టీఎస్‌07హెచ్‌బీ6516)లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అదే రాత్రి 11 గంట‌ల‌కు త‌న పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా జీవించాల‌నే ఆస‌క్తి లేద‌ని తెలిపాడు.

ఈ మేర‌కు భార్య అంబ‌టి సైద‌మ్మ‌ శ‌నివారం ఉద‌యం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ద‌ర్యాప్తులో భాగంగా శ‌నివారం మ‌ధ్యాహ్నం 12గంట‌ల స‌మ‌యంలో చెర్లపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో ఒక కారులో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి మిస్సింగ్ అయిన అంబటి రమేష్ గా గుర్తించారు. ఆయ‌న గుర్తు తెలియ‌ని పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నామ‌ని మేడిప‌ల్లి సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి తెలిపారు.