2 March, 2026 | 6:29 PM

మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

02-03-2026 04:39 PM

మిషన్ భగీరథ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ బాలేష్ డిమాండ్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరుతూ All India Trade Union Congress (AITUC) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె హరిత , ఎల్ & టీ  యాజమాన్య ప్రతినిధి శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మిషన్ భగీరథ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ బాలేష్ మాట్లాడుతూ ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అనేక సార్లు L&T యాజమాన్యాన్ని కలిసినా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించడంతో పాటు కనీస వేతనం రూ. 26,000/- గా నిర్ధారించాలని, ఒక నెల జీతాన్ని బోనస్‌గా ఇవ్వాలని, పెట్రోల్ అలవెన్స్ మంజూరు చేయాలని, EPF మరియు ESI వివరాలను పూర్తి స్థాయిలో తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే AITUC ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమార్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.