2 March, 2026 | 8:11 PM

భిక్షాటన చేసిన శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి

02-03-2026 04:36 PM

మహాలక్ష్మి యాగ నిమిత్తం కాగజ్‌నగర్ పట్టణంలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి పాల్గొన్నారు

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. త్వరలో పట్టణంలో నిర్వహించనున్న మహాలక్ష్మి యాగం విజయవంతంగా నిర్వహించాలనే సంకల్పంతో శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి (మిర్యాలగూడ) ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్వామి వారు భక్తులతో కలిసి పాదయాత్రగా సాగుతూ యాగ మహిమను వివరిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు కార్యక్రమానికి హాజరై స్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మహాలక్ష్మి యాగం సమాజ శ్రేయస్సుకు, ప్రజల ఆయురారోగ్యాలకు, సౌభాగ్య సమృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. స్వామి ఎమ్మెల్యేకు మంగళాశాసనాలు అందజేసి ఆశీర్వదించారు.

భిక్షాటన కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు స్వచ్ఛందంగా భిక్షా దానాలు సమర్పించి యాగానికి తమ వంతు సహకారం అందించారు. మహాలక్ష్మి యాగం తేదీలు, కార్యక్రమ వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఈ యాగం ఎంతో ఉపయుక్తమవుతుందని భక్తులు అభిప్రాయపడ్డారు.