10 March, 2026 | 9:30 AM

నిర్వాసితులకు రూ. 338 కోట్ల పరిహారం

09-03-2026 01:29 AM

పెంచిన మొత్తాలతో చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం

2 నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ 

ప్లాట్లు కూడా రిజిస్టర్ చేసి ఇవ్వాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, మార్చి 8: ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద పెంచిన మొత్తాలతో కలిపి రూ. 338 కోట్లను చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో నిర్వాసితులకు అందజేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ కూడా ఇచ్చారని ఆయన వెల్లడించారు. దీనితో పాటుగా మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన తరహాలోనే ఉదండాపూర్ నిర్వాసితులకు కూడా ప్లాట్లు రిజిస్టర్ చేసి ఇవ్వాలని కోరామని చెప్పారు.

హైదరాబాద్ లోని జలసౌద లో ఆదివారం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై జరిగిన అధికారిక సమీక్షా సమావేశం లో ఈ విషయాలపై చర్చించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని రూ.18 లక్షలకు పెంచడం, ఈ కారణంగా నిర్వాసితులకు అదనంగా రూ.146 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం గతంలోనే అంగీకరించిందని గుర్తు చేశారు. పెంచిన పరిహారం తో కలిసి ప్రస్తుతం ఉదండాపూర్ నిర్వాసితులకు ఇంకా రూ.338 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో నిర్వాసితులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.

అలాగే గతం మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు జివో నంబర్.1 ద్వారా వారికి కేటాయించిన ప్లాట్లను రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగిందని అదే విధంగా ఉదండాపూర్ నిర్వాసితులకు ఇస్తున్న ప్లాట్లను కూడా రిజిస్టర్ చేసి ఇవ్వాలని కోరామని తెలిపారు. ఈ విషయం గురించి ఇదివరకే జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేయకపోగా భూములు లేని వారికి కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పరిహారాలు ఇచ్చారని చెప్పారు.

లేని వారికి కూడా ఇళ్లు ఉన్నాయని రికార్డులు క్రియేట్ చేసి వారికి కూడా పరిహారం చెల్లించాలని జాబితాలు తయారు చేశారని విమర్శించారు. ప్రస్తుతం తాము రీ సర్వే చేయించి అర్హులను గుర్తించడం జరిగిందని అన్నారు. అలాగే భూములు లేకుండానే దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పరిహారాలు కొట్టేసిన వారి నుంచి రికవరికి ఆర్ ఆర్ చట్టం కింద నోటీసులు కూడా జారీ చేయించడం జరిగిందని, ఇళ్లు లేకుండానే జాబితా లో ఉన్న అనర్హుల పేర్లను తొలగించడం కూడా జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు.

ఉదండాపూర్ నిర్వాసితులలో కొంత మంది కోర్టుకు వెళ్ళడం జరిగిందని వారితో కూడా మాట్లాడి వారికి రావాల్సిన పరిహారాన్ని కూడా అందరితో పాటు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి కోరారు. ఉదండాపూర్ ప్రాజెక్ట్ పనులను కూడా త్వరిత గతిన పూర్తి చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్  విజ్ఞప్తి చేశారు. ఉదండాపూర్ నిర్వాసితుల విషయం లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించరని తెలిపారు.