పద్మశాలి టౌన్షిప్ మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు
జలమండలి ఎండీని కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, జూన్ 3 (విజయక్రాంతి): డాక్టర్ ఏఎస్రావు నగర్ డివిజన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్లో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టౌన్షిప్ ప్రతినిధులతో కలిసి జలమండలి ఎండీ అశోక్ రెడ్డిను కలిసి సమస్యను వివరించారు.
టౌన్షిప్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎండీ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, శాశ్వత పరిష్కారంగా కొత్త మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే వినతిపై స్పందించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, పద్మశాలి టౌన్షిప్కు కొత్త మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
స్థల కేటాయింపు పూర్తయిన వెంటనే రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించి, ప్రజలకు నిరంతరాయంగా మంచినీటి సరఫరా అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. జలమండలి ఈడీ పంకజకు కూడా సమస్యపై లేఖ అందజేయగా, త్వరలోనే సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటామని, పద్మశాలి టౌన్షిప్ ప్రజల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.






