4 June, 2026 | 2:26 AM

మండల ప్రాథమిక పాఠశాలలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల ప్రారంభం

04-06-2026 01:04 AM

నాగోల్, జూన్ 3 (విజయక్రాంతి): నాగోల్ జైపూర్ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. కొత్త తరగతుల నిర్వహణ కోసం ఒక ఉపాధ్యాయురాలిని, ఒక ఆయాను నియమించడంతో పాటు అవసరమైన విద్యా సామగ్రిని సమకూర్చి, తరగతి గదులను ఆకర్షణీయంగా సుందరీకరించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం తదితర ప్రభుత్వ సంక్షేమ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పరిసర ప్రాంతాల తల్లిదండ్రులకు ఆయన సూచించారు. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు. నూతన విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు చేరి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.