31 July, 2026 | 4:06 PM

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై అధికారులతో సమీక్షా సమావేశం

03-09-2025 12:40 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, ఖాళీగా ఉన్న సిబ్బంది నియమకానికి చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆస్పత్రి పర్యవేక్షకులు, వైద్య కళాశాల ప్రిన్సిపల్, వైద్య సిబ్బందితో వైద్య సేవలకు అధునాతన పరికరాలు ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు నిబద్ధతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తద్వారా జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు.

24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో పారిశుధ్యం, క్లీనింగ్ బాగాలేదని మురుగునీరు నిల్వలు లేకుండా డ్రైనేజీ పనులు చేపట్టి నీళ్లు బయటకు పంపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వైద్య సేవలకు మహారాష్ట్ర నుండి ప్రజలు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నందున శానిటేషన్ పనుల నిర్వహణకు అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఇప్పటికే సి ఎస్ ఆర్ నిధుల ద్వారా జిల్లా కలెక్టర్ రాహుల్  శర్మ ప్రత్యేక చొరవతో సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేశామని త్వరలోనే  సిటీ స్కాన్ మిషన్ ను ప్రారంభించి రోగులకు సేవలు అందుబాటులోకి తెస్తామని అన్నారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వైద్య సేవల్లో ప్రజలకు ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆస్పత్రిలో ఓపి సేవలు పెరిగాయని పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై మరింత ఫోకస్ చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి సి ఎస్ ఆర్ నిధులతో వైద్య విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.