ఎమ్మెల్యే గూడెం అక్రమాలు రూ.300 కోట్లు
- ఈడీ సంచలన ప్రకటన
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): అక్రమ మైనింగ్ ద్వారా బీఆర్‌ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని, వాటి విలువ రూ. 300 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది. మనీ లాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో రెండు రోజులపాటు పటాన్‌చెరులోని ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు జరిపింది. సోదాలు పూర్తి కావడంతో శుక్రవారం ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రూ. 300 కోట్ల అక్రమాలు జరిగాయి.
ప్రభుత్వానికి రూ. 39 కోట్ల నష్టం చేకూర్చారు. బ్యాంకు అకౌంట్లలోనూ అక్రమ లావాదేవీలను గుర్తించాం. అక్రమంగా సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. సోదాల సందర్భంగా రూ. 19 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాం. బినామీల పేరుతో జరిపిన లావాదేవీలను కూడా గుర్తించాం. కొన్ని బ్యాంకు లాకర్లను ఇంకా తెరవాల్సి ఉంది. గూడెం సోదరులకు పలువురు బినామీలు ఉన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను గుర్తించాం. నగదు లావాదేవీలకు సంబంధించిన మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నాం. అని ఈడీ పేర్కొంది.






