3 August, 2026 | 12:26 AM

రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే కుట్ర

22-06-2024 01:18 AM
  • తెలంగాణ సంపద కార్పొరేట్లకు ధారాదత్తం
  • టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం 
  • ప్రజలంతా మరోసారి ఏకం కావాలని పిలుపు

రంగారెడ్డి , జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే కుట్రలు జరుగుతున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం షాద్‌నగర్  మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ పాత్ర అమోఘం అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కల్గించేందుకు తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయని, తెలంగాణ జాతి సంపద సింగరేణిని వేలం వేయడం అంటే  తెలంగాణ భవిష్యత్తు వినాశనానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  షాద్‌నగర్ నియోజకవర్గంలో లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించి ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తామని తెలిపారు.  కార్యక్రమంలో పాలమూరు రంగారెడ్డి అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి, విద్యవంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య పాల్గొన్నారు.