12-02-2026 11:40:55 AM
చిట్యాల,(విజయక్రాంతి): చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వాన పత్రికను ఆలయ అధికారులు గురువారం అందజేశారు. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న మహాశివరాత్రి పర్వదినోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే కు ఆలయ ఈవో మెహన్ బాబు, స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణ, అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.