వర్షాకాల సన్నద్ధతపై అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు
ఇల్లందు టౌన్, జూలై 3, (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన శాఖల వారీగా పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఆరోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అత్యవసర వైద్య సేవలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్, రెవెన్యూ, ఆర్‌అండ్బీ, పంచాయతీరాజ్, విద్య, వ్యవసాయ శాఖలు వర్షాల కారణంగా తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి వెంటనే పరిష్కరించేలా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, తహసీల్దార్ ఖాసీం, ఎంపీడీవో ధన్సింగ్, వ్యవసాయ అధికారి సతీష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






