మండలంలోని పలు పాఠశాలలను సందర్శించిన ఎంఎల్ఎ జారే
దమ్మపేట,(విజయక్రాంతి): త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, మల్కారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా చదువుకోవాలని సూచించారు.
ప్రతిరోజూ చదివిన పాఠాలను పునర్విమర్శ చేసుకుంటూ సమయపాలనతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. లక్ష్యంతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పదవతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక ప్రణాళిక ద్వారా వారిని చైతన్యవంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు.




