12 August, 2026 | 3:44 PM

​కల్వకుర్తి అభివృద్ధికి రూ.130 కోట్లు మంజూరు చేయాలి

12-08-2026 01:17 PM

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రతిపాదనలు

​నియోజకవర్గానికి అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి

​రంగారెడ్డి, అగస్టు12 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy) బుధవారం హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలుపై పలు కీలక ప్రతిపాదనలను సీఎంకు సమర్పించారు. ​మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.80 కోట్లు ఇవ్వాలని ఆమనగల్ మున్సిపాలిటీలో(Amangal Municipality) సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రూ.30 కోట్లు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

​గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థకు రూ.50 కోట్లు: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు,గ్రామపంచాయతీలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థనుమెరుగుపరచడానికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పేదలు, లంబాడీ సామాజికవర్గాల జనాభా అధికంగా ఉన్నందున వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు అదనంగా మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు.

​నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ఈ ప్రతిపాదనల ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, నిధుల మంజూరుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.