రైల్వే బ్రిడ్జి వంతెన పనులకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఘట్ కేసర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో నిలిచిపోయిన రైల్వే బ్రిడ్జి వంతెన నిర్మాణ పనులకు తన సొంత డబ్బులు ఇవ్వడానికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముందుకు వచ్చారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డిని స్థానిక బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
రైల్వే వంతెన నిర్మాణ పనులు ఆగిపోవడంతో వారం రోజుల క్రితం ఎమ్మెల్యే శాసనసభలో ఈవిషయాన్ని లేవనెత్తినా ప్రభుత్వం దగ్గర నుండి స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యేని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, పలుగుల మాధవ రెడ్డి, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి వివరించారు. మీరు ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులతోనే వంతెన పనులు జరిగాయని, ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు రాక పోవడంతో కాంట్రాక్టరు పనులు ఆపి వేయ డం జరిగిందని తెలిపారు.
తమరు పెద్ద మనసుతో మిగిలిపోయిన పనులకు కాంట్రాక్టర్ కి సాయం చేసినట్లయితే పనులు పూర్తయితాయని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దూరం చేసిన వారు అవుతారని, ఇక్కడి ప్రజలు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే మల్లారెడ్డికి విన్నవించడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. వెంటనే కాంటాక్టర్ తో మాట్లాడి మిగిలిపోయిన పనులకు తాను డబ్బులు ఇస్తానని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ వెంటనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి రావడం జరిగింది.
త్వరలో పనులు మొదలు పెడతానని కాంట్రాక్టర్ సత్తిరెడ్డి ఎమ్మెల్యేకి నాయకులకు తెలియజేయడం జరిగింది. ఈసందర్భంగా తాము చాలా కాలంగా పడుతున్న బాధలను, ఇబ్బందులను కనికరించి మిగిలిపోయిన వంతెన పనులకు తన సొంత డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఘట్ కేసర్ ప్రజల తరపున, భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున ఘట్ కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ, యువజన సంఘాలు, అన్ని కుల సంఘాల నాయకులు ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.




