పుట్టినరోజు ఆధ్యాత్మికంగా జరుపుకొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
వేములవాడ, జూన్ 5 (విజయక్రాంతి) చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు (ఐఎన్సీ) డాక్టర్ మేడిపల్లి సత్యం తన జన్మదిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే సత్యంకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తివాచకాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు గౌరీభట్ల శ్రీనివాస్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. జన్మదిన వేడుకల సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.






