హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే
అభివృద్ధి అంశాలపై వినతిపత్రాల అందజేత
మల్కాజిగిరి, జూలై 11(విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శనివారం రసూల్‌పుర, బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవనంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పలు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కౌకూర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 11, 35, 50, 56 పరిధిలో ఉన్న శ్యామల లక్ష్మీనగర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, విలాస్ స్ప్రింగ్ కాలనీలపై ప్రభావం చూపుతున్న హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్లోని 60 మీటర్ల ప్రతిపాదిత రహదారిని తొలగించాలని ఎమ్మెల్యే కోరారు.
అదేవిధంగా గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాల్‌గూడ ప్రాంతంలో సర్వే నంబర్లు 704, 705 (16-125 అండ్ 16-126/1), 754/3, 755/2 (15-70), 711 (16-84), 762/5 అండ్ 763/7 (16-132/1) పరిధిలోని మీర్జాల్‌గూడచిన్మయ మార్గ్ రోడ్డులో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన 60 అడుగుల రహదారిని 30 అడుగులకు కుదించాలని విజ్ఞప్తి చేశారు.
కాకతీయ నగర్ డివిజన్ పరిధిలో ఏఎస్‌రావు నగర్ నుంచి నేరేడ్‌మెట్ వరకు ఏఎస్రావు నగర్, సాయినాథ్‌పు రం, జే.కే. కాలనీ, సమతా నగర్, కాకతీయ నగర్ ప్రాంతాల గుండా ప్రతిపాదించిన 100 అడుగుల రహదారిని హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని ఎమ్మెల్యే కోరారు. ఇదే సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో సీఆర్‌ఎం పీ రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని కూడా ఎమ్మెల్యే ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రాలపై కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సానుకూలంగా స్పందిస్తూ, సంబం ధిత అంశాలను సమగ్రం గా పరిశీలించి ప్రజలకు అనుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






