నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు.. పోచారం కీలక వ్యాఖ్యలు
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా, ఏ త్యాగమైన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తనపై వస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై స్పందించారు.
తన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని పోచారం పేర్కొన్నారు. తనకు స్వార్థం ఉందంటూ కొందరు బుద్ధిహీనులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ చేసిన పనులను తాను ప్రశంసించిన సందర్భంలో కేసీఆర్ చేశారు కాబట్టే చేశారనే చెప్పాను అని పోచారం వివరించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తానని ఆయన తెలిపారు.
ప్రజల కోసమే తన జీవితం అంకితం చేశానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు అనుకూలంగా పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని, తాను ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఏడు దఫాలుగా ప్రజా ప్రతినిధిగా సేవ చేసే అవకాశం తనకు లభించిందని పోచారం తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావించడం తన ధర్మం, మానవత్వమని పోచారం పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో సహకరించిన వారిని గుర్తించి వారికి కృతజ్ఞతలు చెప్పడం తప్పు కాదని ఆయన అన్నారు.






