calender_icon.png 9 February, 2026 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే ప్రగతి వర్సెస్..మాజీ ఎమ్మెల్యే పట్టు!

09-02-2026 12:00:00 AM

  1. రెండేళ్లలో ఎల్లారెడ్డికి కోట్లాది నిధులు.. మదన్ మోహన్ మార్క్ అభివృద్ధిపై కాంగ్రెస్ ధీమా

మదన్మోహన్ నిధుల జోరు.. సురేందర్ పదేళ్ల పట్టు.. గెలుపెవరిది?

ప్రతిష్టాత్మక పోరు.. ఎల్లారెడ్డి ఓటరు నాడి ఎటు?

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 8(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో పట్టణ రాజకీయాలు రణరంగంగా మారాయి. ప్రచారానికి కేవలం రెండు రోజులే గడువు ఉండటంతో అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తమ ప్రతిష్టను పణంగా పెట్టి ఎన్నికల ప్రచారన్ని చేపడుతున్నారు.అభివృద్ధి అనే మంత్రమే ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారడంతో,ఇరువురు నేతల మధ్య ప్రచారంలో సవాల్-ప్రతిసవాళ్లు తారస్థాయికి చేరాయి.

 మదన్ మోహన్ రావు రెండేళ్లలో పదేళ్ల ప్రగతి 

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన రెండున్నర ఏళ్ల పాలనలో ఎల్లారెడ్డి పట్టణానికి నిధుల వరద పారించారని అధికార పార్టీ శ్రేణులు హోరెత్తిస్తున్నాయి.గత పదేళ్లలో జరగని అభివృద్ధిని తాము రికార్డు సమయంలో చేసి చూపించామని వారు పేర్కొంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలోనే పేద విద్యార్థులకు ప్రప్రథమంగా రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించడమే కాకుండా, కుల, మత అనే తేడా లేకుండా విద్యార్థులందరూ ఒకే చోట కలిసి చదువుకోవాలనే ఉద్దేశంతో వాటి పనులు సైతం ప్రారంభించనున్నారు.

పట్టణ యువతకు ఉపాధి దిశగా ATC (అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్)ఐటీఐ (ITI) సెంటర్లు తీసుకువచ్చారు. పట్టణ ప్రజల కలల ప్రాజెక్ట్ మినీ ట్యాంక్ బండ్ (పెద్ద చెరువు అభివృద్ధి), గాంధీ చౌక్ ఆధునీకరణ,100 ఎకరాల్లో అర్బన్ పార్క్ వంటి వినూత్న ప్రాజెక్టులతో నిధులు రాబట్టడంలో సక్సెస్ కావడమే కాకా పట్టణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించారు.నూతన బస్టాండ్ నిర్మాణం,ప్రతి వార్డులో సిసి రోడ్లు,డ్రైనేజీ వంటి పనుల కోసం కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వారు వెల్లడిస్తున్నారు.

సురేందర్ వ్యూహం గత పదేళ్ల ప్రగతే బలం 

మరోవైపు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తన పదేళ్ల అనుభవాన్ని, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని నమ్ముకున్నారు. బిఆర్‌ఎస్ హయాంలోనే ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా మారిందని, ఇప్పుడు కాంగ్రెస్ చెప్పు కుంటున్న పనుల్లో చాలా వరకు తాము గతంలోనే ప్రతిపాదించినవని వారు విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ గతంలో తాము చేపట్టిన రోడ్ల విస్తరణ,సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని సురేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గెలుపెవరిది? 

ప్రచార గడువు దెగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గకుండా వార్డులను జల్లెడ పడుతున్నారు.ఇరు పార్టీల నాయకులు గడపగడపకూ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ,ఓటరు మాత్రం నిశ్శబ్దంగా ఉంటూ ఇరువురి మాటలను గమనిస్తున్నాడు.

మదన్మోహన్ తెచ్చిన భారీ నిధులకు చేస్తున్న అభివృద్ధి పనులకు ఓటరు పట్టం కడతారా? లేక సురేందర్ పదేళ్ల పట్టుకే మళ్లీ మొగ్గు చూపుతారా? అనే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఫిబ్రవరి 13న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.