క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది
ఉట్నూర్, ఆగస్టు 29( విజయక్రాంతి): జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్ మండలంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా ర్యాలీలో ఎమ్మెల్యే తో పాటు ఐటీడీఏ పీవో మంద మకరందు లు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శించిన నృత్యాలను తిలకించిన ఎమ్మెల్యే వారిని అభినందించారు. ఇటీవల వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాణించిన క్రీడాకారులను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించి, వారి ప్రతిభను అభినందించారు. అనంతరం క్రీడా విద్యార్థులకు ఎమ్మెల్యే గారు స్వయంగా స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించవచ్చని, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు క్రీడా రంగంలో తమ ప్రతిభను చాటుతూ మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
యువత చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకుని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఐటీడీఏ పీవో మంద మకరందు మాట్లాడుతూ... క్రీడలతోపాటు విద్యపై ప్రతి విద్యార్థి తమ ప్రతిభను కనపరచాలన్నారు. క్రీడల్లో జాతీయస్థాయి క్రీడల్లో రాణించే విధంగా ఆటలు నేర్చుకోవడం తోపాటు ఉన్నత విద్యావంతులుగా ఎదిగందుకు కష్టపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఐటిడి ఏ అధికారులు పాల్గొన్నారు.






