calender_icon.png 26 January, 2026 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం

26-01-2026 12:19:30 PM

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. 

షాద్‌నగర్ జనవరి 26 (విజయక్రాంతి): మహనీయులు మనకోసం, మన హక్కుల కోసం సృష్టించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందని, స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతకాలని ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహానీయులు రాజ్యాంగాన్ని రచించి మన ముందుకు తెచ్చారని, ఫలితంగానే ఈరోజు ఈ పాలన వ్యవస్థ కొనసాగుతుందని వెల్లడించారు.

భిన్నత్వంలో ఏకత్వం గా సాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని హక్కులను అందించారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటిని క్రోడీకరించి సరళమైన, కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలని, సామాజిక వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు అనుభవించగలిగినప్పుడే సాధించిన స్వాతంత్రానికి సార్ధకత చేకూరుతుందన్నారు. మన దేశంలో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అతి ముఖ్యమైన పండుగలని ఆయన అన్నారు. దేశ సమగ్రత కోసం అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, బాబర్ అలీ ఖాన్, రఘునాయక్ తడితరులు పాల్గొన్నారు.

ఘనంగా గణతంత్ర దినోత్సవం.. 

గణతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ సందర్భంగా మువ్వన్నెల జెండా ఎగురవేసి వందనం చేశారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం లో ఆర్డిఓ సరిత జెండా ఎగురవేయగా, ఎసిపి కార్యాలయంలో ఎసిపి లక్ష్మీనారాయణ జెండా ఎగురవేశారు. ఆర్డీవో కార్యాలయంలో అధికారి సరిత, అదేవిధంగా పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం, గ్రంథాలయం, వ్యవసాయ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్ తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా ఎగరవేశారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగురవేయడంతో పాటు చిన్నారులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రతాపరెడ్డి, కిష్టయ్య ఆయా శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.