రాయికల్ - రామేశ్వరం రహదారికి ‘మహర్దశ’
రూ. 12 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం
భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రామేశ్వరం భక్తులకు తప్పనున్న ఇబ్బందులు
షాద్‌నగర్,(విజయక్రాంతి): నియోజకవర్గంలోని రాయికల్ నుంచి విట్యాల వరకు అత్యంత కీలకమైన రహదారి నిర్మాణానికి మోక్షం లభించింది. సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 9 కిలోమీటర్ల బీటీ రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapally Shankar ) మంగళవారం భూమి పూజ నిర్వహించారు. రాయికల్ సర్పంచి జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాయికల్ కమాన్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, ఎమ్మెల్యే స్వయంగా జెసిబితో పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 44 నుంచి రాయికల్, రామేశ్వరం, జోగామ్మగూడ, విట్యాల, కంసాన్ పల్లి, భీమారం తదితర గ్రామాలకు ఇది ప్రధాన రహదారి అని పేర్కొన్నారు. ప్రసిద్ధి గాంచిన రామేశ్వరం దేవాలయానికి వచ్చే వేలాది మంది భక్తులు, స్థానిక ప్రజలు రహదారి సరిగ్గా లేక ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కేవలం 'దంపుడు ఉపన్యాసాల'కే పరిమితమైందని, అభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఈ రోడ్డు వేశారని, మళ్ళీ ఇప్పుడు తమ ప్రభుత్వంలోనే దీనికి మహర్దశ పట్టిందని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. రహదారి పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి కావడానికి కాంట్రాక్టర్లకు స్థానిక సర్పంచులు, నేతలు సహకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, ఫరక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కంసాన్పల్లి మాజీ ఎంపిటిసి శేఖర్, రామేశ్వరం సర్పంచ్ మానస సురేష్, అన్నారం సర్పంచ్ లావణ్య రామకృష్ణ, కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్, ఉప్పరిగడ్డ సర్పంచ్ చందు నాయక్, కంసాన్పల్లి సర్పంచ్ గీత యాదయ్య, మాజీ సర్పంచులు ఆశన్న గౌడ్ రాయికల్, రామేశ్వరం, అన్నారం, విట్యాల, కంసాన్పల్లి, కడియాల కుంట తదితర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




