calender_icon.png 3 June, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ నంబర్

02-12-2024 12:00:00 AM

ఆ మిత్రుడిప్పుడు లేడు

నా మొబైల్‌లో అతని నంబరుంది

ఫోన్ చేస్తే

నెట్‌వర్క్ కావల

ఎక్కడో వున్నాడని చెప్తుందేమో.

పొద్దున్నే

సూర్యోదయంతోపాటు

అతని శాబ్దిక మేఘాలు

ఆప్యాయంగా కురిసేవి.

ఉషస్సు లేత ఎండగా

మారేదాకా మాట్లాడేవాడు

ఇప్పుడతనికి చేస్తే

నిర్దాక్షిణ్యమైన నిశ్శబ్దమే జవాబు.

అతడు చనిపోయినప్పటినుంచి

నేను కాస్త కాస్త తరిగిపోయినట్టుగా ఉన్నాను

ఆత్మ కొంచెం కొంచెం మసకబారిపోయింది.

అతని గొంతులో ఎంతో ఆప్యాయత ఉండేది

అతని పెదవులపై చిరునవ్వు

సిగ్నల్ టవర్లు దూకి

నా కళ్లల్లోకి వెలుగై దూకుతున్నట్టనిపించేది

ఇవాళ అతడు లేడంటే

అతని జ్ఞాపకం

క్షణక్షణం పెద్దదై కనిపిస్తుంది.

ఏమైనా సరె

అతని నంబరును

డిలీట్ చెయ్యడానికి మాత్రం

వేళ్లు ఆడవు.

ఎప్పుడో గుండెమీద పొడిపించుకున్న

పచ్చబొట్టును

చెరిపెయ్యడం ఎంత కష్టం!

-


 డా. ఎన్. గోపి