14 May, 2026 | 1:40 AM

టీఎస్, ఎన్‌డీఎంఎ అత్యవసర వ్యవస్థపై మాక్ ఎక్సైజ్

14-05-2026 12:00 AM

మే 18న నెక్లెస్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద నిర్వహణ

సికింద్రాబాద్, మే 13 (విజయక్రాంతి): జిల్లాలో వరదలు వంటి విపత్తు పరిస్థితుల సమయంలో అత్యవసర వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఎ) సహకారంతో మే 18న నెక్లెస్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద రాష్ట్ర స్థాయి ఫ్లడ్ మాక్  ఎక్సైజ్ చేపడతామని ఇన్‌చార్జీ డీఆర్‌వో శ్రీధర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముందుగా మే15,  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.35 గంటల వరకు టేబుల్ టాప్ ఎక్సైజ్ నిర్వహిస్తామన్నారు. ఇందులో శాఖల వారీగా విపత్తు ప్రతిస్పందన చర్యలు, సమన్వయ వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో అమలు చేయాల్సిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఇన్‌చార్జీ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వరదలు, విపత్తు పరిస్థితుల్లో వివిధ శాఖల బాధ్యతలు, స్పందన విధానం, వనరుల సమీకరణ, సహాయక చర్యలు, పరస్పర సమన్వయ వ్యవస్థలపై శాఖల వారీగా సమగ్రంగా వివరించారు.

ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ప్రొటెక్షన్) రవి, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, మల్కాజిగిరి అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి, జిల్లా యువజన, క్రీడల అధికారి గోకుల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పవన్, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా. విద్యానంద్ గౌడ్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డ్, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక, రవాణా, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్యం, ప్రజారోగ్యం, సివిల్ సప్లైస్, సమాచారశాఖ, యువజన సేవలు, రాష్ట్ర, జాతీయ విపత్తు స్పందన దళాలు, హైడ్రా అధికారులు తదితరులు పాల్గొన్నారు.