23 July, 2026 | 1:46 AM

ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ బిల్డింగ్!

23-07-2026 12:00 AM
  1. విద్యార్థులు, అధ్యాపకుల ప్రాణాలతో చెలగాటం
  2. ఎక్కడికక్కడే ఊడిపడుతున్న గోడల పెచ్చులు
  3. ప్రిన్సిపాల్ గది సైతం సురక్షితం కాదు
  4.   13 ఏళ్లకే శిథిలావస్థకు చేరిన భవనం

కారేపల్లి జూలై 22 విజయక్రాంతి: ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ భవనం ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది. రోజూ వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న ఈ భవనంలో ఎక్కడికక్కడ గోడల పెచ్చులు ఊడిపడుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పాఠశాల ప్రిన్సిపాల్ గదిలో సైతం గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి నెలకొనడం నిర్మాణం ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. వర్షాలు కురిసే సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 13 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మోడల్ స్కూల్ భవనం ఇప్పటికే శిథిలావస్థకు చేరుకోవడం నిర్మాణ నాణ్యతపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. బయటకు చూస్తే భవనం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, లోపల గోడల్లో పగుళ్లు, ఊడిపోతున్న ప్లాస్టర్, బలహీనమైన నిర్మాణం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు ఈ భవనంలోనే తరగతులకు హాజరవుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే భయం నెలకొంది. ఏదైనా దుర్ఘటన జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భవనానికి తక్షణమే సాంకేతిక పరీక్షలు నిర్వహించి, అవసరమైన మరమత్తులు  చేయుటకు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ వివరణ..

మోడల్ పాఠశాలకు సంబంధించిన భవనము గురించి ప్రిన్సిపాల్ ఏలియట్ ప్రేమ్ కుమార్ వివరణ కోరగా పాఠశాల భవనముకు పెచ్చులు ఊడి పడుతున్నది  వాస్తవమేనని ఈ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.