25 July, 2026 | 8:13 PM

ఆదాయం పెంచే ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలి

25-07-2026 07:10 PM

బిజినేపల్లి: వాతావరణ మార్పులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, వ్యవసాయ కూలీల కొరత, ఒకే పంటను నిరంతరం సాగు చేయడం వల్ల నేల సారవంతం తగ్గిపోవడం, భూగర్భ జలాలు క్షీణించడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పాలెం ఆర్.ఏ.ఆర్.ఎస్ అసోసియేట్ డైరెక్టర్ డా. ఎల్. కృష్ణ అన్నారు. ఈ పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించే ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విలువ ఆధారిత వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలపై రైతులు అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమన్నారు.

పాలెం ఆర్.ఏ.ఆర్.ఎస్ కేంద్రంలో గ్రామీణ యువతకు ఆధునిక వ్యవసాయం, అగ్రి బిజినెస్‌పై ఆరు రోజుల శిక్షణ  శనివారంతో పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆర్.ఏ.ఆర్.ఎస్ అసోసియేట్ డైరెక్టర్ డా. ఎల్. కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, గ్రామీణ యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి రోజు రోజూకి తగ్గుతూ, వ్యవసాయేతర రంగాల వైపు మొగ్గు పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభదాయకమైన, సాంకేతికత ఆధారిత వృత్తిగా పరిచయం చేసి యువతను ఆకర్షించాలని అన్నారు.

పంటల మార్పిడి విధానం, సహజ వ్యవసాయం, సమగ్ర వ్యవసాయ విధానాలు, మిల్లెట్ల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్ తయారీ, తేనెటీగలు, పట్టు పురుగుల పెంపకం, రైతు ఉత్పత్తిదారుల సంస్థల  ద్వారా మార్కెటింగ్, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై నిపుణులు సమగ్రంగా శిక్షణ అందించారన్నారు. కార్యక్రమం శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. ఈశ్వర్ రెడ్డి, డా. మమత తదితరులు పాల్గొన్నారు.