8 May, 2026 | 3:03 AM

దివ్యాంగుల సంక్షేమానికి మోదీ సర్కార్ ప్రత్యేక చర్యలు

08-05-2026 01:16 AM

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

కేంద్ర మంత్రి  సంజయ్ కుమార్

సిరిసిల్ల, మే 7,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఆర్థిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 466 మంది దివ్యాంగులకు రూ.84 లక్షల విలువైన 813 ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సంజయ్ కుమార్ మాట్లాడుతూ అవయవ లోపం బలహీనత కాదని, ఆత్మవిశ్వాసంతో జీవితంలో గొప్ప విజయాలు సాధించవచ్చని అన్నారు. చేతులు, కాళ్లు లేకపోయినా చరిత్ర సృష్టించినవారు, చూపులేకపోయినా ప్రపంచానికి మార్గదర్శకులైనవారు ఎందరోమంది ఉన్నారని పేర్కొన్నారు. మనిషిని పరిమితం చేసేది శరీరం కాదు& ఆత్మవిశ్వాసమే విజయానికి అసలు బలం అని చెప్పారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఏడీఐపీ,ఆలింకో వంటి పథకాల ద్వారా ఉపకరణాలు, విద్య, ఉపాధి, యాక్సెసిబుల్ మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు అధిక బడ్జెట్ను కేటాయిస్తున్నామని తెలిపారు.కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు దివ్యాంగులు, మహిళలు, పిల్లలు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్రం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. త్వరలో మరిన్ని శిబిరాలు నిర్వహించి అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ఉపకరణాలు అందిస్తామని హామీ ఇచ్చారు.