అమెరికా యుద్ధోన్మాధంపై మోదీ మౌనం వీడాలి
పార్లమెంటు సాక్షిగా అమిత్ షా పచ్చి అబద్దాలు
లొంగిపోయిన మావోయిస్టులపై ప్రభుత్వ నిర్భంధం
మాజీ మావోయిస్టులు బూర్జువా పార్టీలతో కలవద్దు
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ
వరంగల్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): భారత దేశానికి నష్టం కలిగిస్తున్న అమెరికా యుద్దోన్మాదంపై ప్రధాని నరేంద్రమోడీ మౌనం వీడాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ డి మాండ్ చేశారు.
శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ద కాంక్షతో అనేక దేశాలు ప్రభావితం అవుతున్నాయని, ఇంధ న సరఫరాలో ఇక్కట్లతో పాటు భారతదేశంలోని రైతుల ఉత్పత్తులు, పండ్లు, కూరగా యలు, బియ్యం తదితర వస్తువుల ఎగుమతి నిలిచిపోయిందన్నారు. యుద్దం ప్రభావం తో దేశంలో అన్ని రకాల ధరలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయని, ప్రజల ఇక్కట్లను తొలగించి భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడేందుకు, ట్రంప్ దుర్మార్గాన్ని ఆపేందుకు ప్ర ధాని మోడీ మౌనం వీడాలన్నారు. యుద్ధం పేరుతో దాడి చేస్తున్న దేశాలతో మాట్లాడకుండా యుద్ధం వల్ల నష్ట పోతున్న ఇరాన్ తో మాట్లాడడం దేశానికి అవమానకరమన్నారు.
ఒకవైపు అమెరికాలోనే 50 రాష్ట్రాల లో ట్రంప్ కు వ్యతిరేకంగా లక్షలాది మంది నిరసనలు తెలుపుతుంటే మన దగ్గర అసమర్థ ప్రధానిగా మోడీ బలహీనంగా వ్యవ హరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అబద్దాలు వల్లే వేశారని, కమ్యూనిస్టులు, మావోయిస్టుల పట్ల తన అక్కసును వెల్లగక్కారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ పాల్గొని అనేక త్యాగాలు చేసిందని, ఆనాడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదన్నారు.
నక్సలైట్ ఉద్యమం నుండి విడిపడి బయటికి వచ్చిన గద్దర్ ను అమిత్ షా నక్సలైట్ అన్నారని, మరి అదే గద్దర్ చనిపోతే ప్రధాని మోడీ సంతాపం ఎందుకు వ్యక్తం చేశారని నారాయణ ప్రశ్నించారు. గద్దర్ చనిపోతే సంతాపం తెలిపి నందుకు ప్రధాని మోడీని దమ్ముంటే అరెస్టు చేస్తారా అని, లేదా అసత్యాలు పలికిన అమిత్ షా పై కేసు పెడతారా అని ప్రశ్నించారు. నక్సలైట్లను జన జీవన స్రవంతిలో కలవాలని మొదట కోరింది తామేనని, ఆపరేషన్ కగార్ నిలిపివేసి ఇరు వర్గాలు కాల్పుల విరమణ పాటించాలని తామే సూచించామన్నారు. కేంద్రం అమానుషంగా వ్యవహరించి బయటికి వచ్చిన హిడ్మా లాంటి నక్సలైట్లను వందల మందిని ఎన్ కౌంటర్ చేయించిందని ఆరోపించారు.
లొంగిపోయిన మావోయిస్టులకు కూడా ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వడం లేదని, మావోయిస్టులు ఎవరితో మాట్లాడవద్దని నిబంధనలు పెడుతున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వస్తామని చెప్పిన మావోయిస్టు నాయకులు పోలీసుల ఒత్తిడితోనే రాలేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు సరైన స్వేచ్ఛ, గౌరవం ఇవ్వడం లేదన్నారు. మావోయిస్టులు ఇప్పటికైనా స్వేచ్ఛగా, గౌరవంగా బతుకాలని, ప్రజాస్వామ్య బద్దంగా సీపీఐ వారికి అండగా ఉంటుందని చెప్పారు. 40 ఏండ్ల పాటు వారు జీవితాలను త్యాగం చేశారని, అలాంటి వారు బూర్జువా పార్టీలతో కలువ వద్దని, వారంతా వామపక్ష ఉద్యమంలో భాగం కావాలని కోరారు.
కాగా ఇటీవల క్రిష్టియన్ మతంలో చేరితే ఎస్సీ కులం హోదా రద్దు అవుతుందని వచ్చిన తీర్పు సరికాదని, ఏ మతంలో చేరినా మనిషి కులం ఎన్నటికీ మారదని, క్రిష్టియన్ మతంలో చేరినా ఎస్సీ హోదా రద్దు సరికాదన్నారు. కేంద్రం చేపట్టిన ఎస్‌ఐఆర్ ను తాము వ్యతిరేకిస్తున్నామని, దేశంలో ఫెడరల్ వ్యవస్థను ద్వంసం చేసేందుకే కేంద్రం రాష్ట్రాలపై ఎస్‌ఐఆర్ ను ప్రయోగిస్తున్నదన్నారు.
ఈ విలేఖరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్.ఎ స్టాలిన్, మునిగాల బిక్షపతి, ఎదునూరి వెంకట్రాజం, నేదునూరి రాజమౌళి, యెశబోయిన శ్రీనివాస్, కొట్టేపాక రవి, బత్తిని సదానందం తదితరులు పాల్గొన్నారు.




