సామాజిక సేవలో విద్యార్థుల ముందడుగు
లక్ష్మాపూర్‌లో ఎన్‌ఎస్‌ఎస్ వేసవి శిబిరం ఘన ముగింపు
ఎల్లారెడ్డి,ఏప్రిల్ 3,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక వేసవి శిబిరం ఘనంగా ముగిసింది. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఏడు రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరంలో వాలంటీర్లు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. శిబిరం చివరి రోజు నిర్వహించిన ముగింపు సమావేశానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అవసరమని తెలిపారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, అవగాహన కార్యక్రమాల్లో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చూపిన కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మాపూర్ సర్పంచ్ మంజుల మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడుతూ వాలంటీర్లను ప్రశంసించారు.
ప్రోగ్రాం ఆఫీసర్ జీ. రాణి మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా వాలంటీర్లలో సామాజిక సేవా భావం పెరిగిందని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా క్యాంపులో పాల్గొన్న వాలంటీర్లకు ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐక్యూఎస్ కోఆర్డినేటర్ శంకరయ్య, టీఎస్కేసీ కోఆర్డినేటర్ శివకుమార్, గ్రామ వార్డులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను గ్రామస్థులు అభినందించారు.




