సెప్టెంబర్ 22న మోదీ అమెరికా పర్యటన
- మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’కు హాజరు
- భారీగా నమోదు చేసుకుంటున్న భారతీయ అమెరికన్లు
న్యూయార్క్, ఆగస్టు 28: భారత ప్రధాని నరేంద్రమోదీ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నది. త్వరలో ఆయన అమెరికాలో నిర్వహించనున్న ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ ఈవెంట్‌కు ఏకంగా 24వేల మంది ప్రవాసులు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే అందుకు నిదర్శనం. నసావు వెంటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదికగా జరుగనున్న ఈ కార్యక్ర మానికి మోదీ రాకను అక్కడి భారతీయులంతా స్వాగతిస్తున్నారు. ఆ వేదిక కెపాసిటీ 15 వేల మందికి మాత్రమే సరిపోతుందని, కానీ రిజిస్ట్రేషన్లు రోజురోజుకూ పెరుగుతున్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమా నికి మొత్తం 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు హాజరవుతారని వెల్లడించారు. మోదీ వచ్చే నెల 26 న్యూయార్క్‌లో జరిగే అత్యున్నత స్థాయి యూఎన్ జనరల్ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నారు.
మోదీ అమెరికా పర్యటనలు ఇలా..
2014లో తొలిసారి ప్రధానిగా ప్రమా ణం చేసిన మోదీ ఇదే ఏడాది న్యూయార్క్‌లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశాని కి హాజరయ్యారు. ప్రఖ్యాత మాడిసన్ స్కేర్ గార్డెన్‌లో ఆయన ప్రసంగం భారతీయ అమెరికన్లను అమితంగా ఆకట్టుకున్నది. 2019లో టెక్సాస్‌లోని హ్యూస్టన్ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో జరిగిన మెగా ఈవెంట్‌లో మోదీ మరోసారి పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హాజరయ్యారు. త్వరలో నిర్వహించే ‘ప్రోగ్రెస్ టుగెదర్’ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అక్కడి భారతీయులు మరోసారి సిద్ధమవుతున్నారు.




