రేపే మోదీ ప్రమాణ స్వీకారం.. వేడుకకు రాబోయే విదేశీ అతిథులు వీరే..!
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి జూన్ 9వ తేదీ ఆదివారం రాత్రి 7:15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో జరుగనుంది. ప్రధాన మంత్రితో పాటు కొత్త మంత్రివర్గంలో మంత్రి మండలి కూడా ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా అతిథులు హాజరుకానున్నారు. ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలువురికి ఆహ్వానాలను పంపించింది.
ఈ వేడుకలో పాల్గొనేందుకు బంగ్గాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే విదేశీ అతిథుల కోసం లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ వంటి ప్రధాన హోటళ్లు గట్టి భద్రతను కలిగి ఉన్నాయి. మారిషస్ ప్రధాని- ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు-డాక్టర్ మహ్మద్ ముయిజు,శ్రీలంక అధ్యక్షుడు-రణిల్ విక్రమసింఘే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు-అహ్మద్ అఫీఫ్,నేపాల్ ప్రధాన మంత్రి-పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’, భూటాన్ ప్రధానమంత్రి-షెరింగ్ టోబ్గే మొదలగు అతిథులు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేయనున్నారు.






