31 August, 2026 | 7:51 PM

అంగన్‌వాడీలకు 65 ఏళ్ల వయోపరిమితి

09-06-2024 12:40 AM
  • విధుల నుంచి విశ్రాంతి కల్పించాలని సర్కార్ నిర్ణయం 
  • రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పైగా టీచర్లు, హెల్ఫర్లు ఉంటారని అంచనా 
  • సర్వీస్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రూ.లక్ష, హెల్పర్స్‌కు రూ.50వేలు 
  • అసరా పింఛన్ కూడా ఇచ్చేందుకు సిర్కార్ సిద్ధం 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): వయోపరిమితి దాటిన అంగన్‌వాడీలను సర్వీస్ నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65 ఏళ్లు నిండిన వారికి విశ్రాంతి కల్పించి, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. సర్వీస్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రూ. ఒక లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు చెల్లించనుంది. వీరిని వృద్ధాప్య ఫించన్లకు అర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జాబితాను పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి సంబం ధిత జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లు పూర్తయిన అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు సుమారుగా 2 వేలకు పైగా ఉంటారని సమాచారం. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,700 సెంటర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్‌కు వయోపరిమితి లేదు. టీచర్లకు పదో తరగతి ఉత్తీర్ణత, హెల్పర్లను విద్యార్హత లేకుండానే నియమించారు. వయోభారంతో రిజైన్ చేయడం, మరణించడం లేదా ఇతర కారణాలతో పోస్టులు ఖాళీ అయినప్పుడు కొత్తవారిని నియమించేవారు. దీంతో 65 నుంచి 70 ఏళ్లు ఉన్న వారు అనేక మంది కొనసాగుతున్నారు. పెద్దగా చదువుకోకపోవడం, వయోభారంతో మారిన విధా నాలకు అనుగుణంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వమే 65 ఏళ్ల పరిమితి తీసుకొచ్చింది.

అందుకు 2023 సెప్టెంబర్ 5న జీవో 10 జారీ చేసింది. ఈ మేరకు అర్హులైన జాబితాను పంపించాలని ఏప్రిల్ 3న సంబంధిత శాఖ నుంచి అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం టీచర్లకు రూ.13,600, హెల్పర్స్‌కు రూ.8,600 వేతనం ఇస్తున్నారు. హెల్పర్స్‌కు బర్త్ సర్టిఫికెట్ లేదని, వారి విషయంలో వయసు నిర్ధారణలో కొంత ఆయోమయం నెలకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు చాలీచాలని జీతాలున్న అం గన్‌వాడీలు తమకు వచ్చే సర్వీస్ బెనిఫిట్స్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

టీచర్లకు రూ.లక్ష, హెల్ఫర్లకు రూ.50 వేలతో తామేట్ల బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలవారి జీతంతోనే కాలం వెల్లదీస్తున్నామని, ఏ ఆధారంలేని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5లక్షలు చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. అర్హులైన వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

కనీస వేతనం ఇవ్వాలి

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వాలి. అంగన్‌వాడీలు  తక్కువ వేతనంతో పని చేస్తున్నాం. కుటుంబ పో షణకు ఇబ్బందులు అవుతున్నందున కనీసం వేతన ఇచ్చి ఆదుకోవాలి. ఆయాలు లేని అంగన్‌వాడీల్లో ఆయాలను నియమించాలలి. రాష్ట్రంలో  దాదాపు 4 వేల మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీల్లో ప్రభుత్వం విలీనం చేసినప్పటికి.. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన పెండింగ్ వేతనం కూడా ఇవ్వాలని కోరారు. 

  వరలక్ష్మీ, అంగన్‌వాడీ టీచర్స్

 (మినీ) అసోషియేషన్ వ్వవస్థాపక అధ్యక్షులు