31 August, 2026 | 9:53 PM

టార్గెట్ రియల్ గ్రీన్ ప్లాన్ 2050

09-06-2024 02:30 AM

మూడు జోన్లుగా తెలంగాణ విభజన

గ్రీన్ తెలంగాణ డెవలప్‌మెంట్ పేరుతోప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ప్రభుత్వం 

రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనున్న రియాల్టీ

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగరాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ గ్రీన్ ప్లాన్  పేరుతో ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. ఇందులో ప్రధానంగా తెలంగాణను మూడు జోన్లుగా విభజించనున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు వరకు పూర్తి అర్భన్ జోన్‌గా, ఔటర్ నుంచి ప్రతిపాధిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్భన్ జోన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి అవతల ఉన్న పూర్తి ప్రాంతాలను తెలంగాణ రూరల్ జోన్‌గా విభజించనున్నారు. ఈ మూడు ప్రాంతాలను గ్రీన్ తెలంగాణ డెవలప్‌మెంట్ పేరుతో అభివృద్ధికి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇప్పటికే ప్రకటించిన సీఎం

రాష్ట్రాన్ని గ్రీన్ తెలంగాణగా డెవలప్‌చేస్తామని, ఇందుకోసం 2050 మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో తెలంగాణ భవిష్యత్‌కు పునాదులు వేస్తున్నామని, ఇందులో భాగంగా రాష్ట్రానికి ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ రూపొందిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని, అర్భన్, సెమీ అర్భన్, రూరల్ జోన్లలో ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయాలి? ఏ రకమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి? అనేది ప్రభుత్వం రూపొందిస్తున్న మెగా ప్రణాళికలో స్పష్టంగా ప్రకటిస్తామని చెప్పారు. 

ఉపాధి కల్పన జోన్‌గా మూసీ

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నది పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.1000 కోట్లను కేటాయించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ఈ పథకం పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ అభివృద్ధి ప్రణాళికలో పర్యాటకం, ఆర్థికం, పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. 

ప్రస్తుతం ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు దిగువన ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అనేక ప్రాంతాల రైతులకు మూసీ ప్రధాన సాగునీటి వనరుగా ఉంది. ఈ క్రమంలోనే ఎక్కువ ఎస్టీపీలతో శుద్ధి చేసిన నీటిని మాత్రమే మూసీలోకి వదిలేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూసీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనుండటంతో నది వెంట మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను కూడా రూపొందిస్తున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

పెరగనున్న రియల్ గ్రోత్

ప్రభుత్వ ఖజానాకు జమ అవుతున్న ఆదాయంలో రియల్ ఎస్టేట్ రంగం నుంచే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ఐటీ, ఎడ్యుకేషన్ సంస్థలను ఔటర్, రీజినల్ రింగ్ రోడ్డు వెంట విస్తరించాలని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల హైదరాబాద్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల మేర రియల్ ఎస్టేట్ రంగం మంచి వృద్ధిని నమోదు చేసుకోనుంది. అలాగే ఔటర్, రీజినల్ రింగ్ రోడ్ల వెంట ప్రత్యేక పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసి, ప్రస్తుతం నగరానికి దగ్గరలో ఉన్న పరిశ్రమలను కూడా శివారు ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది.

ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో నిర్మాణ రంగంతోపాటు అవాసాల నిర్మాణం పెరుగుతుందని, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ నగర శివారులోని 40-50 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో హెచ్‌ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ నేటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. మరి కొత్తగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2050 లక్ష్యంగా రూపొందించే మాస్టర్ ప్లాన్ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని రియాల్టర్లు, ఇన్వెస్టర్లు సందిగ్దం వ్యక్తం చేస్తున్నారు. 2050 పేరుతో ప్రభుత్వం రూపొందించే మాస్టర్ ప్లాన్‌కు నిర్ణిత గడువు నిర్ధారిస్తే రియల్టీ రంగంతోపాటు ఉపాధి రంగం మంచి గ్రోత్‌ను నమోదు చేసుకుంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.