17 June, 2026 | 7:25 AM

మోదీ పథకాల వల్లే సత్తా చాటాం

15-06-2024 01:31 AM
  1. 5 నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
  2. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం
  3. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
  4. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌తో భేటీ 

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల వల్లే తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు సాధించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌తో సంజయ్ శుక్రవారం భేటీ అయ్యారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన తరుణ్ చుగ్ ఆయనతో అరగంటకు పైగా ముచ్చటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతోపాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని తరుణ్ చుగ్ వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో బీజేపీకే భవిష్యత్తు

తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికి పైగా ఓట్లు సాధించిందంటే అందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లేనని తరుణ్‌చుగ్‌తో బండి అన్నారు. తెలంగాణలో పార్టీ సాధించిన ఎంపీ సీట్లు రాష్ట్రంలో బీజేపీకి ఉన్న భవిష్యత్తుకు నిదర్శనమని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తొలిసారి అత్యధిక సీట్లు సాధించడంపై తరుణ్ చుగ్.. సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  కేవలం 5 నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని తరుణ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ర్టంలో బీఆర్‌ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ర్టంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధ్యక్ష మార్పిడి ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

బండి సంజయ్‌కు నేతల శుభాకాంక్షలు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు నేతలు శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ తోపాటు తెలంగాణ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు సైతం సంజయ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాంనాయక్, బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు టీ ఆచారి, రాష్ర్ట అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్‌గౌడ్, సంగప్పతోపాటు వివిధ మోర్చాలకు చెందిన నాయకులు సంజయ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.