కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎఫ్ సీ నగర్ కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి మోక్ష దృతి తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సాంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని వినూత్న శైలిలో ప్రదర్శించిన మోక్ష దృతి, తన అభినయం, హావభావాలు, లయబద్ధమైన అడుగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆమె ప్రదర్శించిన నృత్యరూపకం భారతీయ సంస్కృతి, తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబిస్తూ సభికులను ఆకట్టుకుంది. చిన్న వయస్సులోనే నృత్యరంగంలో ప్రతిభ కనబరుస్తున్న మోక్ష దృతి ప్రదర్శనకు హాజరైన ప్రముఖులు, కళాకారులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఈసందర్బంగా జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు నిర్వాహకులు హేమలత, నవీన్ కుమార్, ప్రవర్షి తదితరులు పాల్గొన్నారు.






