14 April, 2026 | 1:41 PM

కోతుల బెడదను నివారించాలి

16-11-2025 12:00 AM

ఇటీవలి కాలంలో తెలంగాణ నలుమూలలా అనేక గ్రామాలు, పట్టణాల్లో కోతుల జనాభా పెరుగుదలను చూస్తున్నాం. కోతి అంటే దైవత్వం, సంస్కృతికి చిహ్నంలా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు కోతుల వల్ల పంటలు పూర్తిగా నాశనమవుతున్నాయి. పంట నష్టంతో పాటు కోతులను అడ్డుకుంటున్నవారిపై దాడి చేసి గాయపరచడం చేస్తున్నాయి. కోతుల బెడద ఒక విసుగుగా ప్రారంభమై ఇప్పుడు తీవ్రమైన గ్రామీణ సంక్షోభంగా మారిపోయింది.

కోతు లు ప్రధానంగా ఇళ్ల గోడలపై నుంచి ఆనుకొని ఉన్న స్తంభాలపైకి ఎగిరే ప్రయత్నంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి తమ చేతులు, కాళ్లు పోగొట్టుకుంటు న్నాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయాలకు కూడా కారణమవుతున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోకి వరదలా దూసుకొస్తున్న కోతులను ఎప్పటికప్పుడు అటవీ మండలాలు లేదా అభయారణ్యాలకు తరలించాలి. కోతుల పునరావాసం కోసం నిధులు కేటా యించడం, శిక్షణ పొంది న అటవీ సిబ్బందిని నియమించడం, పంట నష్టానికి రైతులకు పరిహారం అందించడం వంటి తక్షణ చర్యలు అవసరం. పం చాయతీలు అటవీశాఖతో సహకరించాలి.

అదే సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కోతులపై ఆహారాన్ని విసరడం లాంటి చర్య లు గందరగోళానికి దారి తీస్తుందన్న విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇళ్ల దగ్గర కోతులను అడ్డుకోవడానికి ఇనుప జాలీలు అమర్చుకోవాలి. వన్యప్రాణి చట్టాలను వంద శాతం పాటించాలి. కోతుల బెడద కేవలం అసౌకర్యం మాత్రమే కాదు. మూగజీవాల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతో పాటు రైతులకు వాటి నుంచి ఎటువంటి సమస్యలు ఎదురవ్వకుండా ప్రభుత్వం తగిన చర్యలు ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన అవసరముంది.

 మనోహర్, జనగాం

అసంఘటిత కార్మికులకు రక్షణ కవచం

ప్రస్తుత డిజిటల్ యుగంలో గిగ్ వర్కర్లు అనగా స్వతంత్రంగా పనిచేసే కార్మికులు. వీరు సమాజంలో ఒక ప్రధాన శక్తిగా మారుతున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్లు వంటి వేలాది మంది యువకులు ఈ వర్గానికి చెందినవారే. వీరు ఉద్యోగ సంబంధ భద్రత, ఆరోగ్య బీమా, పింఛన్ వంటి సామాజిక రక్షణలకతీతంగా పని చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘గిగ్ వర్కర్స్ బిల్లును’ తీసుకురావడానికి ప్రయ త్నించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని చెప్పాలి. ఈ బిల్లుతో గిగ్ వర్కర్లకు కనీస వేతనం, బీమా సదుపాయాలు, ప్రమాద భద్రత, ఫించన్ లాంటి హక్కు లు అందించే దిశగా చర్యలు చేపట్టబోతున్నది. ఈ చట్టం అమల్లోకి వస్తే,  గిగ్ వర్కర్లు తమ సేవలకు సరైన గుర్తింపు పొందడమే గాక, వారి జీవన భద్రత కూడా బలపడుతుంది. ప్రస్తుతానికి ఈ వర్గం కార్మికులు రోజుకు ఎన్ని గంట లు పనిచేసినా, ఆదాయం స్థిరంగా ఉండదు.

 శ్రీనివాస్, మెదక్

మౌలిక సదుపాయాలు కల్పించాలి

నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో మురికి కాలువలు శుభ్రం చేయడం లేదు. రోడ్లపై గుంతలు ఉన్నాయి. మిషన్ భగీరథ పైప్‌లైన్లు ఎక్కడ పడితే అక్కడ పగిలిపోయి ఉంటున్నాయి. వీధి దీపాలు వెలగడం లేదు. గ్రామ కార్యదర్శులు, అధికారులు కార్యాలయాలకే పరిమితమ వుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

 నర్సింహ, నల్లగొండ