నితీశ్ ట్రేడ్‌మార్క్!
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఊహించని విజయాన్ని అందుకుంది. సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి ఏకంగా 202 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎన్డీఏ కూటమి విజయంలో బీజేపీ పాత్ర ఎంతో ఉందో జేడీయూ పాత్ర కూడా దాదాపు అంతే ఉంది. ఎందుకంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 43 సీట్లకే పరిమితమైన జేడీయూ.. అభివృద్ధే మంత్రంగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించింది.
ఇదే బీహార్ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్‌కు వృద్ధాప్యం మీద పడిందని, బ్యాలెన్స్ తప్పుతున్నారని, ఆయన ఒక పల్టూరామ్ అని విపక్షాలు ఎదురుదాడికి దిగినా ఆయన మాత్రం మౌన మునిలా వ్యవహరించారు. సుశాసన్ బాబుగా పేరున్న నితీశ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిని అనుసరించడం ఇవాళ ఆయన్ను మరోసారి విజయపథాన నిలబెట్టింది. ప్రతీసారి ఎన్నికల సమయంలో ఒక రాజకీయ నేతగా నితీశ్ కుమార్ వినూత్న శైలిని అనుసరించడం అలవాటు. ఒకసారి జంగిల్‌రాజ్ నిర్మూలన అంటే, మరోసారి వెనుకబడిన వర్గాల సంక్షేమం అన్నారు.
ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు 20 ఏళ్ల పాటు సీఎంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీశ్‌కు ఓటరు నాడి కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. అందుకే సరిగ్గా ఎన్నికలు ప్రకటించిన నాడే ముఖ్యమంత్రి రోజ్‌గార్ యోజన అభియాన్ కింద దాదాపు కోటి నలభై లక్షల మంది మహిళలకు వారి బ్యాం క్ అకౌంట్లలో నేరుగా పదివేల రూపాయలు పడేలా చేసి ఓటర్లను ఆకర్షించారు. వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న బీహార్‌లో నెలకు 6 వేల రూపాయల సగటు ఆదాయం కూడా లేని రాష్ట్రంలో నగదు బదిలీ అనేది సగటు మహిళలను ఎంతో ప్రభావితం చేసింది.
ఫలితంగా ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసినప్పటికీ నితీశ్ కుమార్ లేనిదే బీహార్ రాజకీయాలు లేవన్న సంగతి వారికి బాగా తెలుసు. అందుకే తమ కూటమి తరఫున సీఎం అభ్యర్థి పేరును ప్రకటించకుండా, నితీశ్ సారధ్యంలోనే ఎన్నికలకు వెళుతున్నట్లు మోదీనే స్వయంగా పేర్కొనడం బీహార్ ప్రజల్లో ఆయనకున్న చరిష్మాను బయటపెట్టింది.
అధికారం కోసం ఎంతవరకైనా వెళ్తారని నితీశ్‌కు అపవాదు ఉన్నప్పటికీ పాలనలో మాత్రం మంచి పేరు ఉంది. 2005లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితీశ్ కుమార్ అప్పటివరకు జంగిల్‌రాజ్‌గా పేరు పడిన బీహార్‌లో తన మార్కు ను చూపించడం మొదలుపెట్టారు. రహదారులు, మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణ, విద్య, మహిళా సాధికారత, శాంతి భద్రతల విషయంలో మార్పునకు పెద్దపీట వేశారు.
బీహార్ తలరాతను మార్చిన సీఎంగా నితీశ్ పేరు తెచ్చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలు సమాన స్థానాల్లో పోటీ చేయగా.. నితీశ్ పార్టీకంటే బీజేపీ నాలుగు స్థానా లు ఎక్కువగా తెచ్చుకుంది. బీహార్ తదుపరి సీఎం ఎవరన్నది ఇప్పుడు చర్చగా మారింది. బీజేపీ పెద్దలు ఎన్నోసార్లు నితీశ్ నాయకత్వంలోనే తాము నడుస్తున్నామని చెప్పుకున్నా, రాష్ట్రాన్ని స్వయంగా ఏలాలన్న ఉత్సా హం రాష్ర్టస్థాయి నాయకుల మనసులో ఉంది. కానీ నితీశ్ చరిష్మాతో పోటీపడగల నేత లేకపోవడం బీజేపీకి పెద్ద లోటు. దీంతో నితీశ్ మరోమారు సీఎం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.




