19 March, 2026 | 3:52 AM

ఆస్తి పన్ను చెల్లింపులకు 3 నెలల రాయితీ

19-03-2026 02:16 AM
  1. మున్సిపల్ ఆదాయం పెంచేందుకు కసరత్తు

ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 18 (విజయక్రాంతి): కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించబోతోంది. ఏటా కేవలం ఏప్రిల్ నెలలో మాత్రమే అమలు చేసే ప్రతిష్టాత్మక ఎర్లీ బర్డ్ పథకాన్ని ఈసారి వినూత్నంగా, మరింత కాలం పాటు పొడిగించాలని నిర్ణయించిం ది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్కీమ్‌ను ఏకంగా మూడు నెలల పాటు అమలు చేసేందుకు మున్సిపల్ పరిపాలన శాఖ కసరత్తు చేస్తోంది. పన్నును ముందుగా చెల్లించే పౌరులను ప్రోత్సహించడంతో పాటు, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా ఈ సరికొ త్త రాయితీ విధానాన్ని రూపొందించారు. అయితే పన్ను చెల్లించే సమయాన్ని బట్టి ఈ రాయితీ శాతం మారుతూ ఉంటుంది.

ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల లో ఏప్రిల్ 1 నుండి 30 వరకు పన్ను చెల్లించే వారికి అత్యధికంగా 5 శాతం రాయితీ లభిస్తుంది. అదేవిధంగా ఏప్రిల్లో చెల్లించలేకపోయిన వారు రెండో నెల అయిన మే నెలలో పన్ను కడితే వారికి 3 శాతం రిబేట్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇక మొదటి రెండు నెలలు గడిచిపోయిన తర్వాత, జూన్ నెలలో పన్ను చెల్లించే వారికి కూడా ఊరటనిస్తూ 2 శాతం రాయితీని కల్పించనున్నారు.

సాధారణంగా ఏప్రిల్ నెలలో పన్ను కట్టే వారికి మాత్రమే రిబేట్ ఇవ్వడం వల్ల చాలామంది గడువు లోపల నిధులు సర్దుబాటు చేసుకోలేక ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, మూడు నెలల వెసులుబాటు కల్పించడం ద్వారా ఎక్కువ మందిని రాయితీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనివల్ల పౌరులకు ఆర్థికంగా లాభం చేకూరడమే కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్లకు ముందస్తుగా నిధులు సమకూరి అభివృద్ధి ప  నులకు ఊతం లభిస్తుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యం గా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి వంటి పెద్ద కార్పొరేషన్లలో ఈ విధానం ద్వారా రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.