అధికశాతం ఇంజనీరింగ్ ఫ్రెషర్ల నియామకం
- ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా
న్యూఢిల్లీ, జూన్ 6: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్థిక సంవత్సరం చేరనున్న 12,000 మంది ఫ్రెషర్లలో 85 శాతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లేనని బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా వెల్లడించారు. ప్రొబేషనరీ ఆఫీసర్లు, అసోసియేట్స్‌గా 12,000 మంది ఫ్రెషర్లను నియమించే ప్రక్రియలో ఉన్నామ ని, ఆ ర్యాంకుల్లోకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించడానికి సమస్య ఏదీ లేదని ఖారా వివరించారు. కొంత బ్యాంకింగ్ పరిజ్ఞానం కలిగిన 3000 మందికిపైగా పీవోలు, 8,000కుపైగా అసోసియేట్లకు శిక్షణ ఇచ్చిన అనంతరం వివిధ బిజినెస్ రోల్స్‌లో నియమిస్తామన్నారు.
టెక్నాలజీపై ఆధారం
బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యం లో, కస్టమర్లకు వినూత్న సేవల్ని అందించే క్రమంలో కొన్ని బ్యాంక్‌లు ఇంజనీర్ల నియామకానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఫ్రెషర్లకు బ్యాంకింగ్‌లో శిక్షణ ఇచ్చిన తర్వాత వారి ఆప్టిట్యూడ్, టెంపర్‌మెంట్‌లకు అనుగుణం గా బిజినెస్, ఐటీ తదితర రోల్స్‌లోకి పంపిస్తామని ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. తమ మానవ వనరులకు శిక్షణ ఇచ్చేందుకు బ్యాంక్ భారీగా పెట్టుబడి చేస్తున్నదని, టెక్నాలజీ నైపుణ్యాన్ని మెరుగుపర్చడానికి సొంతంగా ఒక ఇనిస్టిట్యూట్ ఉన్నదని ఖారా చెప్పారు. బ్యాంకు భారీ పరిమాణంలో లావాదేవీలను హ్యాండిల్ చేస్తున్నందున, సిబ్బందిలో ప్రతీ ఒక్కరూ టెక్నాలజీలో ముందు ఉండాలన్నారు. టెక్నాలజీపై ఎస్బీఐ చేస్తున్న వ్యయాన్ని వెల్లడించేందుకు ఆయన నిరాకరిస్తూ పరిశ్రమలోకెల్లా తాము అధికంగా టెక్నాలజీపై ఖర్చు చేస్తున్నామన్నారు. బ్యాంకింగ్ పరిశ్రమ నిర్వహణా వ్యయాల్లో 78 శాతం టెక్నాలజీపై ఖర్చు చేస్తున్నదని ఖారా తెలిపారు.






