26 June, 2026 | 7:01 PM

బంగారం ధగధగ

07-06-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 6: అంతర్జాతీయ మార్కెట్లో  బంగారం హఠాత్తుగా పెరగడంతో హైదరాబాద్‌లో సైతం ఒక్కసారిగా ఎగిసింది. గురువారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.770 పెరిగి  రూ.73,420 వద్దకు చేరింది. 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.700 అధికమై రూ.67,300 స్థాయికి ఎగిసింది. రెండు వారాల క్రితం పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన తర్వాత క్రమేపీ రూ.71,500 స్థాయికి దిగివచ్చింది. అటునుంచి స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న పుత్తడి తాజాగా రూ.73,000 స్థాయిని అధిగమించింది.

ప్రపంచ మార్కెట్లో  ఔన్సు బంగారం ధర 30 డాలర్ల మేర ర్యాలీ జరిపి 2,360 డాలర్లపైకి చేరింది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో పుత్తడి ధర పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ తాజా సమీక్షలో పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించడం సైతం బంగారం ధరకు మద్దతుగా నిలిచిందన్నారు. 

రూ.1,800 పెరిగిన వెండి

ప్రపంచ మార్కెట్లో పుత్తడి బాటనే వెండి అనుసరించడంతో స్థానిక మార్కెట్లో కేజీ వెండి ధర  రూ.1,800 పెరిగి  రూ.98,000 స్థాయికి చేరింది. ఇటీవల ఇది రూ.1,02, 000 స్థాయిని అధిగమించిన సంగతి విదితమే. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 30.50 డాలర్ల స్థాయికి చేరింది. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో యూఎస్ బాండ్ ఈల్డ్స్ క్షీణించాయని, దీంతో బంగారం, వెండి ధరలు పెరిగాయని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళాంత్రి తెలిపారు.