తెలంగాణ తల్లి ఉత్సవాలు
డిసెంబర్ 9న సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ
సోనియాకు ఆహ్వానం
రాష్ట్ర రాజముద్రపై అసెంబ్లీలో చర్చిస్తాం
ప్రభుత్వ చిహ్నంలో అమరువీరులకు చోటుండాలి
సచివాలయంలో వాస్తు మార్పు పెద్ద విషయం కాదు
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న సచివాలయ ఆవరణలో ఆవిష్కరించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం మీడియాతో ఇష్టోగోష్టిగా మాట్లాడారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లతో పాటు ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ‘తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ అమరుల వీరుల స్థూపానికి స్థానం కల్పిస్తాం. ప్రస్తుత రాజముద్రలో రాజులకే ప్రాధాన్యమిచ్చారు. బాధితులకు కూడా అవకాశం ఉండాలి. కాకతీయ రాజులతో సమ్మక్క, సారక్క యుద్ధం చేసి అమరులయ్యారు.
గెలిచిన వ్యక్తి తనకు ఇష్టం వచ్చినట్టు చరిత్రను రాసుకుంటాడు. ఓడినవారికి ఎంత చరిత్ర ఉన్నా రాసుకోవడానికి అవకాశం ఉండదు. తెలంగాణ రాష్ట్ర రాజముద్ర విషయంలో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటాం. సచివాలయంలో వాస్తు మార్పు విషయంలో పెద్ద వింతేమీ లేదు. మెయిన్ గేట్ నుంచి కాకుండా పక్క గేట్ నుంచి బయటికి వెళ్తాం’ అని వివరించారు.
సీఎంను కలిసిన ఎంపీలు, మంత్రులు
కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీలను సీఎం అభినందించారు. ఎంపీలు నిత్యం ప్రజలకు అందుబా టులో ఉండాలని సూచించారు.
సీఎంను కలిసినవారిలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి, సురేష్‌షెట్కార్, కడియం కావ్య, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సీఎం సలహాదా రు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ విఫ్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, షబ్బీర్‌అలీ, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై పీసీసీ కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం కార్యవర్గ సభ్యులు అభినందించారు.
రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతల భేటీ
సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఐ బుధవారం నేతలు కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగినప్పటికీ మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ విజ యం సాధించిందని అన్నారు. సీఎంను కలిసిన వారిలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, ఈటీ నరసింహరావు ఉన్నారు.
ఇక బీఆర్‌ఎస్‌కు మిగిలింది బూడిదే
బీజేపీని గెలిపించిన బీఆర్‌ఎస్
ఏడు చోట్ల బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు గల్లంతు
ఆ స్థానాలన్నింటా బీజేపీ గెలుపు
కాంగ్రెస్ గెలుపోటములకు నాదే బాధ్యత
బీజేపీని రాముడు కూడా క్షమించలేదు
మోదీ తప్పుకోవాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణలో బీఆర్‌ఎస్ పార్టీయే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలిచిన ఏడు చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకపోవటమే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. బీజేపీని గెలిపించేందకు బీఆర్‌ఎస్ నాయకులు ఆత్మబలిదానం చేసుకుని అవయదానం చేశారని ఎద్దేవా చేశారు.
బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ జూదగాడు. ఆయన బతికున్నంత కాలం కుట్రలు కుత్రాలు ఉంటాయి. ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతూనే ఉంటాయి. మహారాష్ట్రలో కుట్రల ద్వారా వచ్చిన ప్రభుత్వానికి అక్కడి ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. ఫీనిక్స్ పక్షిలా ఎగురుతామని కేటీఆర్ అంటున్నారు. కానీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు మిగిలింది ఇక బూడిదే’ అని అన్నారు. ఒక్క మెదక్‌లో మాత్రమే బీఆర్‌ఎస్‌కు డిపాజిట్ దక్కిందని గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ ఓట్లన్నీ బీజేపీకే
రాముడి పేరుతో రాజకీయం చేసిన బీజేపీని ఆ రాముడు కూడా క్షమించలేదని సీఎం రేవంత్ విమర్శించారు. బీఆర్‌ఎస్ అవిర్భావం నుంచి ఇప్పటివరకు సిద్దిపేటలో గెలుస్తూ వచ్చిందని, ఈ సారి ఎన్నికల్లో అక్కడ బీజేపీకి 63 వేల ఓట్లు వస్తే, బీఆర్‌ఎస్‌కు 65 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కోసం కాంగ్రెస్ అభ్యర్థి, బలహీనవర్గాల బిడ్డ మధును ఓడించడంతోపాటు బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిని బలిపశువును చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఓట్లన్నీ బీజపీకి బదిలీ అయ్యాయని తెలిపారు.
119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో లెక్కలను పరిశీలిస్తే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో మాత్రమే బీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లు 37.5 శాతం ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయిందని, బీఆర్‌ఎస్ సహకారంతోనే 20 శాతం ఉన్న బీజేపీ ఓట్లు 35 శాతానికి పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిపరచాలన్న బీఆర్‌ఎస్ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. పార్టీ మనుగడకు, కుటుంబ స్వార్థం కోసం చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రపంచంలోనే కేసీఆర్ అత్యంత అవినీతిపరుడని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ఆయనతోనే స్నేహం ఎలా చేస్తోందని ప్రశ్నించారు.
మా పాలనకు రెఫరెండమే
లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ వందరోజుల పాలనకు రెఫరెండమేనని సీఎం రేవంత్‌రెడ్డి పునరుర్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.5 శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు 41 శాతానికి పెరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసినందును ఇప్పుడు పడుతున్న 18 గంట కష్టం కంటే అదనంగా మరో రెండు గంటలు పని చేస్తామని పేర్కొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 3 ఎంపీ సీట్లు మాత్రమే గెలిస్తే.. ఇప్పుడు అదనంగా ఐదు సీట్లు వచ్చాయని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారనేందుకు ఇదే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. ‘నేను జిల్లాకు సీఎంను కాదు. రాష్ట్రానికి సీఎంను. నా బాధ్యత రాష్ట్రానికి పరిమితం. అయితే పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపోటములకు నేనే బాధ్యుడిని. మహబూబ్‌నగర్ పార్లమెంట్‌తో పాటు మిగతా నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. అయినా బోనస్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీంతో అసెంబ్లీలో మా బలం పెరిగింది’ అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేసిన కార్యకర్తలు, నాయకులకు రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
మోదీ హూందాగా తప్పుకోవాలి
దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు తిరస్కరించారని, ప్రధాని మోదీ గ్యారెంటీకి వారెంటీ అయిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాముడి పేరుతో రాజకీయం చేస్తూ ఓట్ల బిచ్చమొత్తిన బీజేపీకి రాముడితోపాటు ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. 2019లో బీజేపీకి సొంతంగా 303 ఎంపీ సీట్లు వస్తే ఇప్పుడు 24౦కి పడిపోయిందని గుర్తుచేశారు. ప్రధాన పదవి నుంచి మోదీ హుందాగా తప్పుకోవాలని, ఇతరులకు అవకాశం కల్పించాలని సూచించారు.
చంద్రబాబు ఆహ్వానిస్తే వెళ్తా
ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటామని, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నీటి సమస్యతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై ఏపీ ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకుంటామని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం చట్టపరంగా తేలిపోయిందని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్తారా? అని మీడియా ప్రశ్నించగా, చంద్రబాబు ఆహ్వానిస్తే వెళ్తానని తెలిపారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో చర్చించాకనే ముందుకు సాగుతామని స్పష్టంచేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌గాంధీ చెప్పారని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం కేంద్రాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.






