24-02-2026 12:34:02 AM
ఏమ్మెల్యే కసిరెడ్డి సీరియస్..
కోవర్టుల గుండెల్లో రైళ్లు!
మున్సిపల్ ఫలితాలపై
4 గంటలపాటు ‘వార్’ రూమ్ సమీక్ష
అన్ని విధాలుగా సఫర్ట్ చేసిన గెలవరా? అంటూ
అభ్యర్థులపై ఫైర్
విజయక్రాంతిలో వెలువడిన కథనంతో పార్టీలో కదలిక
ఆమనగల్లు/కడ్తాల్, ఫిబ్రవరి 23: ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికారంలో ఉండి, భారీగా అభివృద్ధి నిధులు వెచ్చించినా ఆశించిన ఫలితాలు రాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయక్రాంతి దినపత్రికలో ‘ఆమనగల్లో ఏం జరిగిందబ్బా..‘ అనే శీర్షికతో ప్రచురితమైన విశ్లేషణాత్మక కథనం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది.
మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను ఈ కథనం ఎండగట్టడంతో పార్టీ నేతలలో కదలిక వచ్చింది.సోమవారం కడ్తాల్లోని ఒక ఫామ్హౌస్లో జరిగిన రహస్య సమీక్షా సమావేశం ‘వాడి-వేడిగా‘ సాగింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థులను నిలదీస్తూనే, పార్టీలోని కోవర్టులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సమీక్షలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.63 కోట్ల రూపాయల నిధులు, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించడంలో అభ్యర్థులు పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
పార్టీలో ఉంటూ ప్రత్యర్థులతో చేతులు కలిపిన ‘లోపాయికారి‘ నేతల వివరాలు తన వద్ద ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కసిరెడ్డి హెచ్చరించారు. సమీక్షలలో అభ్యర్థుల మౌనం దాల్చారు. ‘మీరు అడిగిన వారికే బీ-ఫామ్స్ ఇచ్చాను, అడిగినంత ఖర్చు చేశాను.. మరి గెలవాలనే కసి ఎందుకు లేదు?‘ అన్న ఎమ్మెల్యే సూటి ప్రశ్నలకు అభ్యర్థులు నీళ్లు నమలడం చర్చనీయాంశంగా మారింది. వార్డుల వారీగా ’సర్జరీ’.. నివేదికలను తన వద్ద పెట్టు కొని నిలదీసినట్లు సమాచారం. సమావేశానికి 15 వార్డుల అభ్యర్థులు, ఇన్చార్జులు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యే తన వద్ద ఉన్న రహస్య నివేదికల ఆధారంగా ఒక్కో వార్డులో జరిగిన పొరపాట్లను ఎత్తిచూపారు.
పోలింగ్ మేనేజ్మెంట్లో స్థానిక నేతలు ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయలేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.‘ఓటమి కంటే.. మీలో గెలవాలనే కసి లేకపోవడమే నన్ను ఎక్కువగా బాధించింది. పార్టీకి వెన్నుపోటు పొడిచే వారికి ఇకపై స్థానం ఉండదని ఎమ్మెల్యే గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థులు సైతం తమ ఓటమికి గల కారణాలను, తమ వైఫల్యాలను సైతం ఒప్పుకున్నట్లు సమాచారం. సమీక్ష సమావేశం లో భాగంగా పార్టీలో కొంత నేతల మధ్య మాటలతోటాలు పేలినట్లు సమాచారం.
త్వరలో భారీ ప్రక్షాళన?...
ఈ సమీక్షా సమావేశం కేవలం విశ్లేషణకే పరిమితం కాలేదని, త్వరలోనే ఆమనగల్ కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన జరగబోతోందని సంకేతాలు వెలువడుతున్నాయి.బాధ్యతాయుతంగా పని చేయని నాయకులు, కోవర్టురాజకీయాలకు పాల్పడిన వారిపై వేటు పడటం ఖాయమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంతో ఆమనగల్ రాజకీయాలు మరో సారి వేడెక్కాయి.