18-09-2025 01:41:42 AM
హన్మకొండ, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువజన సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి. తిరుపతి పిలుపునిచ్చారు. బుధవారం కేయూ మొదటి గేటు వద్ద కేయూ పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మరణించిన అమర వీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, నైజాం నిరంకుశ ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, భూస్వాముల, దొరల దోపిడి అరాచకాలను ఎదురిస్తూ, బాంచన్ దొర నీ కాల్మొక్త అన్న బానిస వ్యవస్థ ఇక చెల్లదని, సామాన్యులను సాయుదులుగా మార్చిన నైజాం అరాచకాలపై తిరగబడి నైజాం ను గద్దె దించిన, సాయుధ రైతాంగ పోరాటం దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు నాలుగు వేల మంది ప్రాణ త్యాగం చేశారని, మూడు వేల గ్రామాలను విముక్తి చేశారన్నారు.
10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి, దున్నేవాడికి భూమి ఇచ్చారని, అలాంటి సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్రలేని మతోన్మాద, విచ్చిన్నకర పార్టీలు విమోచన, విలీనం అంటూ చరిత్రను వక్రీకరిస్తూ, మతం రంగును పులుము తున్నారు.
మతోన్మాద కుట్రలను తిప్పి కొట్టేందుకు విద్యార్థి, యువత సిద్ధం కావాలన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరేగంటి నాగరాజు, కేయూ పరిశోధక విద్యార్థులు మాదాసి రమేష్, కేతపాక ప్రసాద్, కందికొండ తిరుపతి, జె.రాజారాం, స్రవంతి, రాజమణి, పి ఎస్ ఎఫ్ ఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్, డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, బొక్క ప్రవర్ధన్, డి.రంజిత్ పాల్గొన్నారు.
మహదేవపూర్‌లో..
మహదేవపూర్(విజయక్రాంతి): జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈరోజు రజాకార్ల అకృత్యాలకు గోరి కట్టిన రోజు అని, నిజాం నిరంకుశ పాలనకు చిమర గీతం పాడిన రోజు అని,
దొరల గడిలలో ని బానిసత్వానికి సమాధి కట్టిన రోజని, లక్షలాది మంది ప్రజల గుండెల్లో వెలుగులు నింపిన రోజని, మువ్వెలా వెన్నెల జెండా నీడలో స్వేచ్ఛా వాయువులు పిలిచిన రోజని, సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసాన్ని అమరవీరుల త్యాగాన్ని స్మరించుకొ ని, చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకముంద ని అన్నారు. మండల ప్రధాన కార్యదర్శులు లింగంపల్లి వంశీధర్ రావు,బల్ల శ్రవణ్, పూర్ణచందర్, సంతోష్, ఓడేటి బాల్రెడ్డి, కన్నెబోయిన ఐలయ్య, దడిగల వెంకటేష్, కొక్కు రాకేష్, పోత మనోజ్, దుర్గం పోచం, నేన్నెల రాకేష్, పేట సాయి పాల్గొన్నారు.